
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో KVR ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు జిల్లా చెక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా కొత్త లంకపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందు చక్రాలు కూడా ఊడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తుండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. హైస్పీడ్ కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.




