
30న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి
పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 28 2026: మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏన్కూరు మండల కేంద్రంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రైతు ఆశీర్వాద సభ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, జూన్ 30న జరిగే రైతు ఆశీర్వాద సభకు వైరా నియోజకవర్గం నలుమూలల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులను చైతన్యపరిచి సభకు తరలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రైతుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రచారం నిర్వహించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రచార పోస్టర్లలో పేర్కొన్నట్లుగా రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి”, “లక్షలాదిగా తరలిరండి… ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి” అనే సందేశాలను ప్రతి గ్రామానికి చేరవేయాలని సూచించారు. రైతు ఆశీర్వాద సభను చారిత్రాత్మక విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్, సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూగుల్ లచ్చిరామ్ నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ మల్కం గంగయ్య, మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు, సమావేశ ఇంచార్జ్ రాంపూడి రోశయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ కొప్పుల ప్రభావతి రెడ్డి, జిల్లా సెక్రటరీ సామెల్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు మేడ ధర్మారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య లాలు, ఉపసర్పంచ్ ఎస్కే గాలిబ్, మాజీ ఎంపీటీసీ సెబాస్టిన్, గ్రామ పంచాయతీ బీఎల్వోలు, కార్యదర్శులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




