
మహిళల అభ్యున్నతికి మరో అడుగు
కోలన్‌పల్లిలో మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన
పాలకుర్తి/రాయపర్తి(ck న్యూస్)ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : గ్రామీణ మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ రాయపర్తి మండలం కోలన్‌పల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు శాశ్వత వేదిక ఏర్పాటుతో వారి కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రతి మహిళ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




