Khammam
Trending

ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు, సంక్షోభం నుంచి రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు, సంక్షోభం నుంచి రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

  • ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు, సంక్షోభం నుంచి రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఎల్‌నినోను కేవలం వాతావరణ మార్పుగా కాకుండా రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలక సవాలుగా ప్రభుత్వం పరిగణించాలని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత స్పందించడం కాదని ముందస్తు ప్రణాళికతో నష్టాన్ని నివారించడం, ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరించకపోతే కరువు పరిస్థితులు, పంటల దిగుబడి తగ్గడం, తాగునీటి కొరత, భూగర్భ జలాల క్షీణత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మాజీమంత్రి పువ్వాడ హెచ్చరించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలు ప్రధానంగా నాగార్జునసాగర్, గోదావరి జలాలు, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని వంటి జలవనరులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గి జలాశయాలకు ఆశించిన మేర నీటి ప్రవాహం లేకపోతే రాబోయే కాలంలో తాగునీటి, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు.

చెరువులు, కాలువలు, పంపింగ్ వ్యవస్థలు, మిషన్ భగీరథ మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పూడికతీత, జలాశయాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం ఉన్న గ్రామాలు, పట్టణాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ తాగునీటి వనరులు, అత్యవసర నీటి సరఫరా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ సరఫరాపై అదనపు భారం పడుతోందని చెప్పారు.

వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, వ్యవసాయ సలహా సేవలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాస నిల్వలు, పశువులకు తాగునీటి ఏర్పాట్లు, పశువైద్య సేవలను ముందుగానే సిద్ధం చేయాలని కోరారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎల్‌నినో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button