
ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక మహిళా ఆత్మహత్యాయత్నం…
Web desc : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మానసిక వేధింపులను తట్టుకోలేక ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) శుక్రవారం పాఠశాల ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.
బాధితురాలి కథనం ప్రకారం.. గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో సొప్పరి లక్ష్మి ఏడాదిన్నరకాలంగా ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా గురుకులం ప్రిన్సిపాల్ జయశ్రీ ఆఫీస్ పనులే కాకుండా ఇల్లు ఊడ్చడం, దుస్తులు ఉతికించుకోవడం, కూరగాయలు తేవడం వంటి వ్యక్తిగత పనులు చేయించుకోవడంతోపాటు తోటి సిబ్బంది ఎదుట చులకన భావంగా మాట్లాడుతుంది.
గతంలో ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులను చేయకపోవడంతో తనపై తప్పుడు ఆరోపణలు పెట్టి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక లక్ష్మి శుక్రవారం ఉన్నతాధికారులను ఆశ్రయించి వినతిపత్రం సమర్పించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తిరిగి పాఠశాలకు వచ్చిన బాధితురాలిని పిలిచి అందరిముందు అవమానించింది.
దీంతో లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురై తన గదిలోకి వెళ్లి పెద్దమొత్తంలో పారాసిటమాల్ మాత్రలు మింగింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ జయశ్రీని వివరణ కోరగా తనపై కావాలనే అబాండాలు వేస్తున్నారని, ఎవరినీ వేధించలేదని చెప్పారు. హన్మకొండ చౌరస్తా: తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హనుమకొండ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సుమారు ఏడాది క్రితం ఇన్‌చార్జ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అధికారి గత కొద్ది రోజులుగా మాటలు, చేష్టలతో మానసికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఫిర్యాదును స్వీకరించిన ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సదరు అధికారిని హైదరాబాద్‌కు పిలిపించి ప్రాథమిక విచారణ చేసినట్లు ఆఫీసులో చర్చించుకుంటున్నారు.
ఈవిషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జిల్లా మత్స్యశాఖ అధికారిని వివరణ కోరగా.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తను ఎలాంటి విచారణకై నా సిద్ధమని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




