EducationKhammamPoliticalTelangana

శిథిలావస్థలో అంగన్వాడి భవనం..

శిథిలావస్థలో అంగన్వాడి భవనం..

శిథిలావస్థలో అంగన్వాడి భవనం..

చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?

గార్లఓడ్డు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రమాదకరంగా మారిన పాత భవనం – వెంటనే కూల్చివేయాలని గ్రామస్తుల డిమాండ్

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 20 2026: ఏన్కూరు మండల పరిధిలోని గార్లఓడ్డు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న పాత అంగన్వాడి భవనం గత కొన్ని సంవత్సరాల క్రితమే శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడడంతో అది ప్రమాదకరంగా మారింది. దీంతో చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడి కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలలోని మరో గదికి తరలించి అంగన్వాడి విధులు అక్కడే నిర్వహిస్తున్నారు.

అయితే, శిథిలావస్థలో ఉన్న పాత అంగన్వాడి భవనాన్ని మాత్రం ఇప్పటికీ తొలగించకుండా అలాగే వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే ప్రమాదకరంగా ఉన్న ఈ భవనం వద్దకు చిన్నారులు ఆటలాడుతూ వెళ్లే అవకాశం ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.

ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో భవనం గోడలకు పెద్ద పెద్ద నెర్రెలు ఏర్పడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు. గోడలు పూర్తిగా బలహీనపడటంతో ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల, అంగన్వాడి చిన్నారులు తెలియక ఆ భవనం సమీపానికి వెళ్లే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

వర్షాకాలంలో గోడలు మరింత బలహీనపడే అవకాశం ఉండటంతో భవనం ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అంగన్వాడి కేంద్రాన్ని వేరే గదికి మార్చిన అధికారులు, ఈ పాత భవనాన్ని కూల్చివేయడం లేదా పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ శిథిల భవనాన్ని వెంటనే తొలగించాలని, ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తుగా చర్యలు తీసుకుని చిన్నారుల ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button