
అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత కీటకం కాటుతో చిన్నారి మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణాన్ని బలిగొంది – పగడాల నాగరాజు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని 7 వ డివిజన్ టేకులపల్లిలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అయ్యదేవర రవి–స్వప్న దంపతుల పెద్ద కుమార్తె దన్యశ్రీ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత కీటకం కాటుకు గురై మృతి చెందడం తీవ్ర విషాదకరమని ఖమ్మం నగర బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దన్యశ్రీ, తన చెల్లెలు తనుష్టితో కలిసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్తోంది. సోమవారం ఉదయం సుమారు 9 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన దన్యశ్రీని విషపూరిత కీటకం కుట్టినప్పటికీ, విషయం తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయకుండా సుమారు 11:30 గంటలకు సమాచారం అందించారని తల్లిదండ్రులు తెలిపారు. అప్పటికే చిన్నారి కంటికి వాపు వచ్చి పరిస్థితి విషమంగా మారింది.వెంటనే చిన్నారిని ఖమ్మంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో దన్యశ్రీ మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకురాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలతో కలిసి పగడాల నాగరాజు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ “విషపూరిత కీటకం కుట్టిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఉంటే, సకాలంలో వైద్యం అందించి చిన్నారి ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ గంటల తరబడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం.” అంగన్వాడీ కేంద్రం పరిసర ప్రాంతాలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయి ఉండటంతో పాములు, విషపూరిత కీటకాలు సంచరించే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. చిన్నారుల భద్రతను పట్టించుకోకుండా ఇలాంటి వాతావరణంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా, చిన్నారి అంగన్వాడీలో ఉన్న సమయంలో టీచర్ అందుబాటులో లేకపోవడం, ఆయా చిన్నారుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు సంబంధిత అధికారులకు, కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందించినప్పటికీ, చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు కూడా అధికారులు ముందుకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ధర్నా సందర్భంగా ఖమ్మం జాయింట్ కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో, పగడాల నాగరాజుతో పాటు ఇతర నాయకులతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం కోరుకున్న విధంగా ఖమ్మంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని, అలాగే ఐ సి డి ఎస్ అధికారుల ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పగడాల నాగరాజు డిమాండ్లున: చిన్నారి దన్యశ్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి అందించాలి. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలి. కుటుంబానికి ఐ సి డి ఎస్ మరియు ప్రభుత్వం తరఫున తగిన ఆర్థిక సహాయం అందించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతలు, పిల్లల భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను తక్షణమే శుభ్రపరిచి, పాములు, విషపూరిత కీటకాలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి విద్యా సంస్థలో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. “ఒక పేద కుటుంబానికి చెందిన చిన్నారి ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో ఉండగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సంఘటన జరిగిన 24 గంటలు గడుస్తున్నా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ ఘటనపై స్పందించకపోవడం మరింత దారుణం. పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది కేవలం ప్రమాదం కాదు – ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన విషాదం. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలి” అని పగడాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పొదిల నాగరాజు ,వాకదాని బాలకృష్ణ ,సత్తి శివ కృష్ణ ,పొదిల బాబు ,తెరగర్ల గోపి ,పొదిల గోపి
పొదిల రాజు,వారా హరికృష్ణ
అల్లాడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




