
కాక్రోచ్ ఆందోళన రణరంగం.. ఐపీఎస్ అధికారులకు గాయాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ ఈరోజు (సోమవారం) కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ (పార్లమెంట్ మార్చ్) తీవ్ర హింసాత్మకంగా మారింది. దేశంలో జరిగిన నీట్ పరీక్ష అక్రమాలపై జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకునే నేపథ్యంలో భారీగా హింస చేలరేగి పలువురికి గాయాలయ్యాయి.
ఆందోళన కారులపై లాఠీఛార్జ్ : భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసనకారులు జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రదర్శనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోపలి గల్లీల్లోకి ప్రవేశించి, పలుచోట్ల బారికేడ్లను బద్దలు కొట్టారు.
దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా దళాలు నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి లాఠీచార్జ్ మరియు టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ప్రయోగించాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
ఐపీఎస్ అధికారులకు గాయాలు… ఈ ఘటనలో ఐదుగురు ఐపీఎస్ అధికారులతో పాటు 50 మందికి పైగా ఢిల్లీ పోలీస్, పారామిలటరీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీసులకు చెందిన రెండు బస్సుల ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనపథ్ లోని పలు దుకాణాలను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో హింసకు పాల్పడిన 70 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, అదుపులోకి తీసుకున్న వారిలో చాలా మంది విద్యార్థులు కారని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించగా ఆయన అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు.




