
రోడ్డు పక్కన సంచిలో నవజాత ఆడశిశువు
శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డు పై ఎయిర్‌పోర్ట్ కాలనీ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నవజాత ఆడ శిశువును తెల్లటి సంచిలో వదిలివెళ్లిన ఘటన మంగళవారం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం మంగళవారం ఉదయం డయల్-100కు సమాచారం అందడంతో ఆర్జీఐఏ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఒకటి నుంచి రెండు రోజుల వయస్సు ఉన్నట్లు భావిస్తున్న నవజాత ఆడ శిశువును ఓ తెల్లటి సంచిలో గుర్తించి వెంటనే శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన సంరక్షణ కోసం అమీర్‌పేట్‌లోని శిశు విహార్‌కు తరలించారు. శిశువును రోడ్డుపక్కన వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల పై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ శిశువు గురించి ఎవరికైనా సమాచారం ఉంటే ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.




