
బెట్టింగ్ యాప్స్‌కు హెడ్ కానిస్టేబుల్ బలి…
Web desc : బెట్టింగ్, లోన్ యాప్స్ ఓ హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకున్నాయి. డీజీపీ కార్యాలయంలో షోగార్డ్ బృందంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ స్వామి సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీజీపీ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద గురువారం ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన ఏరుకొండల స్వామి(41) తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)2007 బ్యాచ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. స్వామికి భార్య, కుమారుడు, కూతురు. గతంలో గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా పనిచేశాడు.
ప్రస్తుతం కొండాపూర్ బెటాలియన్‌కు వచ్చాడు. విధి నిర్వహణలో నెల రోజుల పాటు డీజీపీ ఆఫీస్ షోగార్డ్ డ్యూటీ కోసం ఈ నెల 2న రిపోర్ట్ చేశాడు. బుధవారం ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఆయన విధులు ముగియాల్సి ఉంది. కాగా, అప్పటికే బెట్టింగ్ యాప్స్‌తో అప్పులపాలైన స్వామి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు.
డీజీపీ ఆఫీస్ మెయిన్ గేట్ షోగార్డ్ విధుల్లో ఉండే ఏఆర్ ఎస్సై వద్ద రాత్రి వేళ పిస్టల్ సేఫ్ కస్టడీలో బాక్స్‌లో పెడతారు. బుధవారం రాత్రి గార్డ్ ఇన్చార్జిగా ఉన్న స్వామి ఆ పిస్టల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి పాయింట్‌బ్లాక్‌లో షూట్ చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం విన్న వింటనే అక్కడున్న ఐదుగురు షో గార్డ్స్ వాష్‌రూమ్‌కి వెళ్లి చూశారు.
వెంటనే డీజీపీ ఆఫీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సమాచారం అందించారు. భార్యా పిల్లలను ఏమైనా అంటే దయ్యమై వస్తా.. స్వామి సూసైడ్‌కు ముందు నోట్‌బుక్‌లో మూడు పేజీల లేఖ రాశాడు. ‘నా ఆత్మకు శాంతి కలగాలంటే నా భార్య, పిల్లలను ఎవరూ ఏమీ అనద్దు. ఇదే నా చివరి కోరిక. ఏదైనా తప్పు చేసి ఉంటే నేను మాత్రమే చేశాను.
నా భార్య, పిల్లలు ఏ తప్పూ చేయలేదు. ఏదైనా శిక్ష అనుభవించాలి అంటే అది నేను మాత్రమే. వాళ్లు కాదు. నా భార్య, పిల్లల్ని ఏమీ అనవద్దు. వాళ్లు మంచివాళ్లు. ఈ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి.. వాళ్లని ఏమీ అనవద్దు. ఏమైనా అంటే దయ్యమై వస్తా..’ అని లేఖలో హెచ్చరించాడు.




