
వీసాల పేరుతో ఘరానా మోసం..?
Web desc : విదేశీ వీసాలు, ఉద్యోగాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఓ యువతి ఖమ్మం నగరంలో ఆందోళనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలు ఇరుకుల్ల శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఏలూరు నరేన్ యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని నమ్మించి తనతో పాటు పలువురి నుంచి రూ.75 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు దశలవారీగా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా తీసుకున్నాడని ఆరోపించారు.
సంవత్సరం గడిచినా వీసా గానీ, ఉద్యోగం గానీ కల్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని ఆమె వాపోయింది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఖానాపురంలో ఉన్న నరేన్ తండ్రి ఏలూరు శ్రీనివాసరావు ఇంటి ముందు తన చిన్నారితో కలిసి బైఠాయించి నిరసన చేపట్టింది. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని స్పష్టం చేసింది.
తన స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి నరేన్‌కు డబ్బులు ఇచ్చానని, ఇప్పుడు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




