
సికె.న్యూస్.ఆదిలాబాద్
గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు
గాదిగూడ ఎస్సై రమ్య, కానిస్టేబుల్ రాథోడ్ భరత్‌కు ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు
గంజాయిపై సమాచారం ఇవ్వండి.. నగదు రివార్డు పొందండి
గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులు, గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
శనివారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో గంజాయిపై సమర్థవంతంగా పనిచేసిన గాదిగూడ ఎస్సై రమ్య, కానిస్టేబుల్ రాథోడ్ భరత్‌లను జిల్లా ఎస్పీ ఆహ్వానించి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డులను అందజేశారు. గంజాయి అక్రమ సాగుపై సమాచారం సేకరించి చర్యలు తీసుకోవడంలో సిబ్బంది చూపిన చొరవను ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గంజాయిపై పోరాటంలో యువతతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రజలకు ఓపెన్ ఆఫర్:
జిల్లాలో ఎక్కడైనా గంజాయి మొక్కల సాగు, విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే నేరుగా జిల్లా ఎస్పీ నిర్వహిస్తున్న WhatsApp నంబర్ 8712659973కు సమాచారం అందించవచ్చని తెలిపారు.
గంజాయి మొక్కలను పట్టించడంలో సహకరించిన వారికి నగదు రివార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, గంజాయి నిర్మూలనలో యువత ముందుండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS పిలుపునిచ్చారు.




