
ఇంటి పన్ను వసూళ్లలో గందరగోళం!
పాత బకాయిల పేరుతో మళ్లీ వసూళ్లు చేస్తున్నారంటూ గ్రామస్తుల ఆరోపణ
ఇప్పటికే పన్ను చెల్లించి రశీదులు పొందాం.. మళ్లీ ఎందుకు చెల్లించాలి?
సికె న్యూస్ | మెదక్ జిల్లా కొల్చారం ప్రతినిధి
కొల్చారం మండలం, వరిగుంతం: గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను వసూళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నును ఇప్పటికే చెల్లించి రశీదులు పొందినప్పటికీ, 2026–27లో పాత బకాయిల పేరుతో మళ్లీ పన్ను చెల్లించాలని కోరుతున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రశీదులు ఉన్నా.. బకాయిలు ఎలా?
గతంలో తాము చెల్లించిన ఇంటి పన్నులకు సంబంధించిన రశీదులు తమ వద్ద ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ, పాత బకాయిలు ఉన్నాయంటూ మళ్లీ చెల్లించాలని కోరడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెల్లించిన పన్నులు పంచాయతీ రికార్డుల్లో సక్రమంగా నమోదు అయ్యాయా? ఒకవేళ నమోదు కాకపోతే అందుకు కారణాలేమిటి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
పాత బకాయిల పేరుతో ఎంతమంది గ్రామస్తులను మళ్లీ పన్ను చెల్లించాలని కోరారు? గతంలో చెల్లించిన పన్నుల వివరాలు రికార్డుల్లో ఎందుకు కనిపించడం లేదు? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ పన్నుల వసూళ్ల రికార్డులు, చెల్లింపుల వివరాలు, జారీ చేసిన రశీదులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి, గ్రామస్తులకు అనవసర ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు.




