
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉప ముఖ్యమంత్రి భట్టికి ఘన స్వాగతం
భారత కాన్సులేట్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి,సి కే న్యూస్ : అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో భారత కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పరస్పరం ఆత్మీయంగా మమేకమయ్యారు.
ప్రవాస భారతీయులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో వారి అనుబంధం మరింత బలోపేతం కావాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
ప్రవాస భారతీయులు కూడా రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, ప్రవాస తెలంగాణ ప్రజలు, భారతీయ సంఘాల ప్రతినిధుల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలపడినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.




