KhammamPoliticalTelangana

నేను ఎక్కడికి పోను.. ఖమ్మం నుంచే పోటీ చేస్తా..

నేను ఎక్కడికి పోను.. ఖమ్మం నుంచే పోటీ చేస్తా..

నేను ఎక్కడికి పోను.. ఖమ్మం నుంచే పోటీ చేస్తా..

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడి వెంట ఉంటూ ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని పువ్వాడ మండిపడ్డారు.
ఆదివారం జరిగిన ఖమ్మం నగర ఖానాపురం హవేలి పరిధి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా బీఆర్ఎస్ పార్టీతోనే కార్యకర్తలు ఉన్నారని, పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎవరి ఉడత ఊపులకు భయపడేది లేదని, తగిన సమాధానం చెప్పేలా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే విధంగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనని తుమ్మలను కేసీఆర్ మంత్రిని చేశారని అన్నారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా మంత్రి పదవిని అనుభవించారని, అయితే ఖమ్మం ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.

తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మం నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సోషల్ మీడియాలో పువ్వాడ అజయ్ కుమార్ పేరు కనిపిస్తే కొందరు ఉబలాటపడుతున్నారని ఆయన విమర్శించారు. పాత కాంగ్రెస్ కంటే కొసరు కొత్త కాంగ్రెస్ నాయకులే ఎక్కువ హడావుడి చేస్తున్నారని, ఇదే విషయాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు.

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. నిర్మాణం పూర్తయిన ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజాధనంతో చేపట్టిన ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన దేవరపల్లి–ఖమ్మం జాతీయ రహదారికి క్రెడిట్ తీసుకునేందుకు ప్రచారం చేసుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాటపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారిని తన ఘనతగా చూపించుకునేందుకు షో చేసేలా ప్రయత్నించడం సరికాదన్నారు. ఆ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోజుకో ప్రమాదం చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రజల భద్రతపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

మున్నేరుపై తీగల వంతెన, రక్షణ గోడలు, ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పువ్వాడ తెలిపారు. వాటికి నిధులు విడుదల చేసి, జీవోలు జారీ చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. మున్నేరు వరద బాధితులకు శాశ్వతంగా అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు.

ఖమ్మం బస్‌స్టాండ్‌ను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే, దానిపై అనేకమంది విమర్శలు చేశారని అన్నారు. గోళ్లపాడు చానల్‌ను సుందరంగా తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా లాగా ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button