
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్ !
web desc : తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ అరెస్టయ్యాడు. తెల్లాపూర్లోని సుమంత్ నివాసం వద్ద పోలీసులు డ్రైవర్ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించడమే కాకుండా, ఆయనపై ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనపై ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ దాడి కేసులో ప్రమేయం ఉన్నందున సుమంత్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న మాజీ ఓఎస్డీ సుమంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వ్యాపారిపై జరిగిన దాడి, దౌర్జన్యం వెనుక ఉన్న పూర్తి వివరాలను రాబట్టేందుకు.. విచారణ వేగవంతం చేసేందుకు గానూ పరారీలో ఉన్న సుమంత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో మొదట మేడిపల్లి పోలీసులు జీరో FIR నమోదు చేసి అనంతరం కేసును జూబ్లీహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై హత్యాయత్నం కేసు నమోదు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం (అటెంప్ట్ టు మర్డర్) కేసు నమోదు చేశారు.
వారం రోజుల కిందట జరిగిన ఈ దాడి ఘటనపై, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల పరిణామాలతో కేసు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వ్యాపారిని తన వద్దకు పిలిపించుకున్న సుమంత్, రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో సుమంత్ తన అనుచరులతో కలిసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారని బాధితుడు గొంగిడి హరికృష్ణ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్పై సెక్షన్ 109 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో కూడా డెక్కన్ సిమెంట్స్ సంస్థ ప్రతినిధులను తుపాకీతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని సుమంత్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసిందే. తాజాగా మరోసారి కొండా ఫ్యామిలీ చర్చనీయాంశంగా మారింది.




