
విద్యార్థుల ఆకలి తీర్చిన అన్నదాత..కే.సత్తయ్యకు ఘన వీడ్కోలు
- ఘనంగా పెద్దేముల్ బీసీ హాస్టల్ కుక్ కే.సత్తయ్య ఉద్యోగ విరమణ అభినందన సభ
- వంట మనిషిగా కే.సత్తయ్య చేసిన సేవలు మరువలేనివి
- తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్ పటేల్
సికే న్యూస్ పెద్దేముల్ ప్రతినిధి, ఆగస్టు 30
తరతరాల విద్యార్థుల ఎదుగుదలే తన కర్తవ్యంగా భావిస్తూ సుమారు నాలుగు దశాబ్దాల పాటు వసతి గృహ విద్యార్థులకు సేవలందించిన పెద్దేముల్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం కుక్ (వంట మనిషి) కే.సత్తయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభను ఘనంగా నిర్వహించారు. పెద్దేముల్‌లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు,వసతి గృహ సిబ్బంది,స్నేహితులు, ఆత్మీయులు,విద్యార్థులు పాల్గొని సత్తయ్యను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని సత్తయ్య సేవలను కొనియాడారు.సుమారు 40 ఏళ్ల పాటు వసతి గృహ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడంతో పాటు, వారి బాగోగులను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని ప్రశంసించారు.ఉద్యోగం కేవలం విధిగా కాకుండా విద్యార్థుల పట్ల బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయడం అభినందనీయమన్నారు.వసతి గృహంలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో సత్తయ్య వంటి సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.విద్యార్థులకు సమయానికి భోజనం అందించడం నుంచి వారి అవసరాలను గుర్తించి ఆప్యాయంగా చూసుకోవడం వరకు ఆయన అందించిన సేవలు ప్రత్యేకమైనవన్నారు.ఉద్యోగ విరమణ పొందుతున్న కే.సత్తయ్యకు వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ జి.శ్రీనివాస్,సీనియర్ ఉపాధ్యాయులు కుమ్మరి అంజయ్య,శుభప్రద్ పటేల్ వెంట సీనియర్ నాయకులు దాసన్న,బాను,మారుతి,విజయ్, రాము గౌడ్, సాయి,నాగులపల్లి చంద్రశేఖర్, హాస్టల్ సిబ్బంది బోయిని మొగులప్ప,యాదయ్య, హాస్టల్ విద్యార్థులు, కే.సత్తయ్య కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.




