
పెట్రోల్ పోసుకుని వ్యక్తి బలవన్మరణం.. భార్యాభర్తల గొడవలే కారణమా?
ఖమ్మం : భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి. భార్య ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిన మరుసటి రోజే భర్త అత్తగారింటి వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి తన కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగాపురం గ్రామానికి చెందిన శనిమల వెంకటేష్(35) గ్రానైట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సుమారు 12 సంవత్సరాల క్రితం స్వప్నతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత రెండు నెలలుగా భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన స్వప్న తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఖమ్మంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది.
మరుసటి రోజు, 9వ తేదీన వెంకటేష్ కూడా బ్యాంక్ కాలనీలోని అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొనడంతో మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న వెంకటేష్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కుమారుని మరణం నేపథ్యంలో వెంకటేష్ తల్లి శనిమల లక్ష్మి(50) ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే తన కుమారుడు పెట్రోల్ పోసుకుని ఆత్మ*హత్యకు పాల్పడినట్లు పేర్కొంటూనే, అతడి మరణం పై తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేష్ అత్తగారింటికి వెళ్లిన సమయంలో అసలు ఏం జరిగింది, అతను పెట్రోల్ పోసుకునేంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి, కుటుంబ కలహాలకు కారణాలేమిటి,అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




