
ఏన్కూరు లో షార్ట్‌సర్క్యూట్‌తో చెరుకు తోట దగ్ధం
కోతకు నెల రోజుల ముందు బుగ్గిపాలైన పంట..
మంటల్లో మాడిన రైతు ఆశలు
రహదారి లేక ఫైర్ ఇంజన్ వెనుదిరిగిన వైనం
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్ 16: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో చేతికొచ్చిన చెరుకు పంట అగ్నికి ఆహుతైంది. కోతకు మరో నెల రోజులు మాత్రమే ఉన్న సమయంలో సుమారు పది ఎకరాల్లో సాగు చేసిన చెరుకు తోట పూర్తిగా కాలిపోవడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఘటన ఏన్కూరు మండలం టి.ఎల్.పేట గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది.
రైతు తెలిపిన వివరాల ప్రకారం టి.ఎల్.పేట గ్రామపంచాయతీ పరిధిలో కౌలు రైతు చిట్టి మోతుల నాగేశ్వరరావు, తండ్రి వెంకటేశ్వర్లు సుమారు పది ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెరుకు తోటలో మంటలు చెలరేగాయి. ఎండిన చెరుకు ఆకులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి కొద్దిసేపటికే తోట మొత్తం దగ్ధమైంది. దీంతో రైతు ఆశలు, నెలల తరబడి చేసిన కష్టం కళ్లముందే బూడిదగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే రైతు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ చెరుకు తోటకు వెళ్లే చెరువు కట్ట రహదారి సక్రమంగా లేకపోవడంతో ఫైర్ ఇంజన్ తోట వద్దకు చేరుకోలేకపోయింది. దీంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించలేని పరిస్థితి ఏర్పడి వెనుదిరగాల్సి వచ్చింది. ఫైర్ ఇంజన్ తోట వద్దకు చేరి ఉంటే మంటలను కొంతమేర అదుపులోకి తీసుకురాగలిగే అవకాశం ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
చెరుకు తోటతో పాటు పంట సాగుకు వినియోగించిన సుమారు 40 నుంచి 50 పైపు గొట్టాలు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు రైతు తెలిపారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోవడంతో రైతు నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంతో పాటు సాగు సామగ్రి కూడా దగ్ధం కావడంతో తన కుటుంబంపై ఆర్థిక భారం పడిందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్ కూడా వెళ్లలేని విధంగా చెరువు కట్ట రహదారి అధ్వానంగా ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతును ఆదుకోవాలని, చెరువు కట్ట రహదారిని మెరుగుపరిచి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక వాహనాలు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




