
రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతాం
కిసాన్ మోర్చా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఫసల్ బీమా యోజనను తక్షణమే అమలు చేయాలి: నెల్లూరు కోటేశ్వరరావు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ వేంసూరు సెప్టెంబర్ 20 2026: రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలోని బీజేపీ సీనియర్ నాయకుడు దొడ్డపునేని కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో బీజేపీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరుకుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నెల్లూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కిసాన్ మోర్చా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం కిసాన్ మోర్చా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
రైతులకు పంట నష్టాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, ఇతర కారణాలతో పంటలు నష్టపోయే రైతులకు పంటల బీమా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులు రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంటల బీమా తదితర ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవీ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నున్నా రవి, మందడపు సుబ్బారావు, వల్లభనేని పుల్లయ్య, దొడ్డపునేని కృష్ణయ్య, మండేపూడి వీర నాగేశ్వరరావు, అపర్తి వెంకటరమణ, సుదర్శన్ మిశ్రా, ప్రభాకర్‌రెడ్డి, గంధసిరి వీరభద్రం గౌడ్, కిసాన్ మోర్చా నాయకుడు లకావత్ నవీన్ నాయక్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




