HyderabadPoliticalTelangana

గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ తదితరుల వినతి

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 19 2026: ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని స్థానిక యువతకు పోలీస్‌ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ అమలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ తదితర గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
2026లో చేపడుతున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన పోస్టులకు గతంలో అమలైన 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ స్పష్టంగా వర్తించకపోవడంతో స్థానిక గిరిజన యువతలో ఆందోళన నెలకొందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 2022లో జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో అమలు చేసిన విధానాన్ని ప్రస్తుత నియామకాల్లోనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన ప్రాంతాల్లోని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతో పాటు, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న యువత పోలీస్‌ శాఖలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక భౌగోళిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్థానిక యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో అమల్లో ఉన్న ప్రత్యేక నిబంధనలను పరిగణనలోకి తీసుకుని 2026 పోలీస్‌ నియామక ప్రక్రియలోనూ 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి 1988లోని జీవో నంబర్‌ 109, 2018లోని గెజిట్‌ నోటిఫికేషన్‌ నంబర్‌ 49లోని నిబంధనలను కూడా ప్రస్తావించారు.
గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ అంశాన్ని సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.
గిరిజన యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వం దృష్టికి అవసరమైన అంశాలను తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button