
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు పట్టుబాటు
రూ.4,870 నగదు, 52 పేకముక్కలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు అక్టోబర్ 03 2026: కల్లూరు సబ్‌డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏన్కూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మరావుపేట గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి పంచుల సమక్షంలో రూ.4,870 నగదు, 52 పేకముక్కలు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్, ఐపీఎస్ తెలిపారు.
నగదు పందెంగా పెట్టి పేకాట ఆడటం, పేకాట స్థావరాలను నిర్వహించడం చట్టపరంగా నేరమని ఏసీపీ హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




