
పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హ*త్య…
web desc : హైదరాబాద్ లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లాడ్జికి తీసుకెళ్లిన ఒక వ్యక్తి యువతిని అత్యంత కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన బేగరి శిరీష (34) హైదరాబాద్లోని ఓ కస్టమర్ కేర్ సెంటర్లో ఉద్యోగం చేస్తుంది.
ఇదే జిల్లా తాండూరు మండలం ఓబులాపూర్కు చెందిన పాత నేరస్థుడు అవుసలపల్లి శ్రీనివాస్ (38)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు 2013లో వివాహం జరిగిందని, 2016లో భర్తతో విడాకులు తీసుకున్నట్లు శిరీష అతనికి చెప్పింది. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ వెంట తిప్పుకునేవాడు.
లాడ్జిలో బస.. దారుణ హత్య.. సెప్టెంబర్ 24న అర్ధరాత్రి ఇద్దరూ కలిసి అమీర్పేటలోని గోకుల్ ప్రైడ్ ఓయో లాడ్జికి వెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. నకిలీ ఆధార్ కార్డులను సమర్పించి, గణేష్, దుర్గ అనే పేర్లతో లాడ్జి రిసెప్షన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. లాడ్జిలోని మొదటి అంతస్తులో ఉన్న 103వ గదిలో బస చేశారు. సెప్టెంబర్ 28 రాత్రి గదిలోనే శిరీషను శ్రీనివాస్ తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
శిరీష తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయడం వల్లే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ గొడవలో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29 తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో శ్రీనివాస్ ఒక్కడే గది నుంచి బయటకు వచ్చాడు. తాను గది ఖాళీ చేస్తున్నానని రిసెప్షన్లో చెప్పి బిల్లు చెల్లించాడు. అంతేకాకుండా, గదిలో ఉన్న శిరీష ఉదయం 9 గంటలకు టిఫిన్ తెచ్చుకుని బయటకు వెళ్లిపోతుందని సిబ్బందిని నమ్మించి అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల ఎంట్రీ… ఉదయం చాలాసేపటి వరకు ఆ గది తలుపులు తెరుచుకోకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. కాలింగ్ బెల్ మోగించినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాడ్జి సిబ్బంది వద్ద ఉన్న అదనపు తాళంతో గది తలుపులు తెరిచి చూడగా.. శిరీష మంచంపై విగతజీవిగా పడి ఉంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




