ఉపాధి పోతే ఎట్ల బతకాలే?!
నన్ను కూడా ఇదే జేసీబీతో సంపెయ్యండి
20 ఏండ్లుగా బతుకునిచ్చిన పాలకేంద్రం కూలగొడితే నేనెట్ల బతికేది?
ఎట్ల కూలగొట్టావో అట్లనే కట్టించి ఇవ్వు లేకుంటే నాశనమై పోతావ్..
ఉపాధి పోతే ఎట్ల బతకాలే?!
నన్ను కూడా ఇదే జేసీబీతో సంపెయ్యండి
20 ఏండ్లుగా బతుకునిచ్చిన పాలకేంద్రం కూలగొడితే నేనెట్ల బతికేది?
ఎట్ల కూలగొట్టావో అట్లనే కట్టించి ఇవ్వు లేకుంటే నాశనమై పోతావ్..
ఇదే నాశాపం
హైదరాబాద్ చిలుకానగర్‌లో ఫుట్‌పాత్ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ
దిక్కులు పిక్కటిల్లేలా రోదించిన మహిళ
ఏయ్.. రేవంత్‌రెడ్డీ.. నీకు అమ్మ, అక్క, చెల్లె ఉంటే నాలాంటోళ్లకు అన్యాయం జరగొద్దు. నీ ప్రభుత్వంతోనే మా పేదోళ్లకు కష్టాలొచ్చినయ్. నా పాలకేంద్రాన్ని నాశనం చేసిండ్రు. నేనేమన్న అక్రమ దందాలు చేస్తున్ననా? కాంగ్రెస్‌కు ఏం అన్యాయం చేసినమని కూలగొట్టిండ్రు? 20 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లనే ఉంటున్నందుకా ఈ శిక్ష. నీకు నీతి, నిజాయితీ ఉంటే ఎట్ల కూలదోసినవో అట్ల మళ్లీ కట్టించి ఇయ్యి. లేకుంటే నీ పార్టీ నాశనమైతది.'
Hyderabad | రామాంతపూర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బత్తిని రాధికాగౌడ్ అనే మహిళకు హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్‌లోని కల్యాణపురి పార్కు వద్ద పాలకేంద్రం ఉన్నది. రోజూ ఇంటింటికి తిరిగి పాల పాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని సాదుకుంటుంది. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం కూడా పాలకేంద్రానికి వెళ్లింది. జేసీబీ రూపంలో తన ఉపాధికి ముప్పు ఉన్నదని, అది ఈ రోజే అని ఆ మహిళ ఊహించనే లేదు. కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీతో వచ్చి పాలకేంద్రంపై ఒక్కసారిగా విరుచుకపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ కూల్చివేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. కండ్లెదుటే బతుకు కూలిపోతుంటే దిక్కులు పిక్కటిల్లేలా ఆమె రోదించసాగింది. ఎవ్వరైనా సాయం చేయండి.. కూల్చివేతను ఆపండి.. కన్నీటి పర్యంతమైంది. అయినా ఆ అధికారులు కనికరం చూపకపోగా, పాలకేంద్రంలోనే ఉన్న ఫ్రిజ్, ఇతర సామగ్రిని కూల్చివేతల్లో ధ్వంసం చేశారు. పాలకేంద్రం కూల్చివేతతో తన బతుకే పోయిందని ఆవేదనతో దుఃఖభారంతో సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడింది. 20 ఏండ్లుగా నమ్ముకున్న పాలకేంద్రం కూలిపోవడంతో ఎలా బతకాలంటూ భీతిల్లింది.
పేదోళ్లపై పడ్డాడు?
'ఏయ్.. రేవంత్‌రెడ్డి.. నీకు అమ్మ, అక్క, చెల్లి ఉంటే నాలాంటోళ్లకు అన్యాయం జరగొద్దు. నీ ప్రభుత్వంతోనే మా పేదోళ్లకు కష్టాలొచ్చినయ్. నీతి, నిజాయితీ ఉంటే ఇల్లు కట్టియ్యాలే. లేకపోతే నీ పార్టీ ఉండదు. నాశనమైతది. గాజులు పగలగొట్టుకొని మన్నుపోస్తున్న. నేనిప్పుడు పెట్రోల్ పోసుకొని సస్త. నాకు న్యాయం జరగాలే. నేనొక ఆడబిడ్డను. పాలమ్ముకొని బతికేదాన్ని. నా కడుపుకొడతరా? మీ కడుపుగాల.. మీరు నాశనంగానూ.. కాంగ్రెస్‌కు ఏం అన్యాయం చేసినం. 20 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్నం. నా పాలకేంద్రం ఫ్రిజ్ అన్నీ నాశనం చేసిండ్రు. ఎన్ని ఇండ్లు కూలగొడుతర్రా? మీరు నాశనమైపోను. నేనేమైనా అక్రమ దందా చేస్తున్నానా? అందరికీ ఉపయోగపడే పాల వ్యాపారం చేస్తున్నా.. అని రాధికాగౌడ్ రోదిస్తూ శాపనార్థాలు పెట్టింది.
స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు
రాధిక ఆవేదనను చూసిన స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదోళ్ల ఉపాధిని కూలగొడితే సర్కార్‌కు ఏమొస్తదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదోళ్లకే కష్టాలు, పెద్దొళ్లంతా బాగానే ఉన్నారంటూ పలువురు తిట్టిపోశారు. చిన్నా చితక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి దూరం చేస్తే మళ్లీ వాళ్లెలా బతకాలో చెప్పాల్సిన బాధ్యత సర్కార్‌కు లేదా? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి సర్కార్‌ను ఎప్పుడూ చూడలేదని రాజయ్య ధ్వజమెత్తారు. రాధిక కుటుంబానికి భరోసా ఏదంటూ అధికారులను నిలదీశారు.
జేసీబీతో నన్ను సంపెయ్యండి?
'బతుకునిచ్చే మా ఉపాధిని కూల్చేస్తున్నరు.. ఇందులోనే నన్ను కూడా జేసీబీతో సంపెయ్యండి. ఇక బతకడానికి మాకు వేరే దారిలేదు. నా భర్త నాలుగేండ్ల నాడు కిడ్నీ వ్యాధితో చనిపోయిండు. నాకిద్దరు పిల్లలు. మాకే ఆధారం లేదు. కూల్చివేతల గురించి కనీసం చెప్పలేదు' అంటూ రాధికాగౌడ్ కన్నీటి పర్యంతమైంది. పెట్రోల్ బాటిల్ పట్టుకొని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది. పేదోళ్ల గూడును కూల్చేందుకేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ఈ ప్రభుత్వం నాశనమైపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెట్టింది. సామాన్యుల కడుపుగొట్టి బాజార్‌న పడేస్తే ఏమొస్తుందిరా సన్నాసి.. అంటూ రోదిస్తూ అటు అధికారులను, ప్రభుత్వాన్ని ఆమె తిట్టిపోసింది.