కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్...
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్...;
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్...
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పైగా పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు.
ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం.
బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం' అని హెచ్చరించారు.
వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలకుగానూ ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది.
సొంత పార్టీ విషయంలో నవీన్ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు.
మరోవైపు.. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా.
ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్‌లో నవీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.