
ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్…
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది.
పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా శనివారం డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.
పాఠశాలలో నిల్వ ఉంచిన ఆహారం తిని ఆరుగురు విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురై కాగజ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
దీనిపై ప్రాథమికంగా స్పందించిన కమిషన్.. ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమేనని, ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, ఆరోగ్యానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. దీనిపై తక్షణమే స్పందించి, ఏప్రిల్ 27 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.




