Khammam
Trending

విద్యార్థుల ప్రతిభకు వేదికగా సక్సెస్ మీట్

విద్యార్థుల ప్రతిభకు వేదికగా సక్సెస్ మీట్

ఏన్కూరులో విద్యా వార్షిక సమీక్షా సమావేశం

విద్యార్థుల ప్రతిభకు వేదికగా సక్సెస్ మీట్

ప్రజల భాగస్వామ్యంతో నమోదు పెంపుపై దృష్టి

ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపాలని పిలుపు

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 22 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని కమ్మవారి కల్యాణ మండపంలో విద్యా వార్షిక సమీక్షా సమావేశం మండల విద్యాధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు ఎమ్మెల్యేకు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులచే ఈసీఆర్ (ECR) అంశంపై అవగాహన నాటక ప్రదర్శన నిర్వహించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ప్రైవేట్ స్కూల్ వద్దు – ప్రభుత్వ బడి ముద్దు” అనే సందేశంతో విద్యార్థులు ప్రదర్శించిన అవగాహన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల నమోదు పెంపుదలలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లపై ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపాలని, ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో భాగంగా “అందరు విద్యార్థుల సక్సెస్ మీట్” నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమని అధికారులు అభిప్రాయపడ్డారు.
అయితే, బడి బాట వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోవడం సమావేశంలో ప్రధాన ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.
అలాగే పీటీఎం (PTM) సమావేశాలకు తల్లిదండ్రుల హాజరు తక్కువగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పీటీఎం సమావేశాలను క్రమబద్ధంగా నెలనెలా నిర్వహించి, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, విద్యాశాఖ ఏవో ప్రభాకర్ రావు, ఎమ్మార్వో సిహెచ్ గిరి రావు, ఎంపీడీవో కృష్ణ, ఎస్‌ఐ ఎన్ సంధ్య, హెచ్ఎంలు వాసవి దేవి, రహీం బి, స్వర్ణ నరేందర్, మెడ ధర్మారావు, మండలంలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button