
వరంగల్ పోలీస్ శాఖలో షాక్.. ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలను పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్ తో పాటు, ప్రస్తుతం సీఏఆర్ విభాగంలో అటాచ్డ్ లో ఉన్న ప్రవీణ్ కుమార్లు సస్పెండ్ అయ్యారు.
వీరి పై వచ్చిన ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపి నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన రెండు నెలలుగా ఆరోపణలు వస్తున్న వారి పై కమిషనర్ కొరడా ఝళిపిస్తున్నారు.
అధికార పార్టీ నేతలకు అంటకాగిన అధికారులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా కేసులు నమోదు చేసిన వారిపై చర్యలు చేపడుతున్నారు. భూ సంబంధించిన కేసులు, మట్టి, ఇసుక, అనధికార వేధింపులకు పాల్పడిన వారిపై ఈ వేటు వేశారు.
ఇప్పటి వరకు ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలపై చర్యలు తీసుకున్నారు. మరికొందరికి నోటీసులు జారీ చేశారు. వరుస సస్పెండ్లతో కమిషనరేట్ పరిధిలోని అధికారులు ఉలిక్కిపడుతున్నారు.



