
మందు కొట్టు అసెంబ్లీకి సీఎం…! డ్రంకెన్ టెస్ట్ చేయాలని డిమాండ్.. వీడియో వైరల్
కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వివాదాలకు వేదికయ్యాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంతో అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించడంతో గందరగోళం మొదలైంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ శిరోమణి అకాలీ దళ్ ఒక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేసింది. పవిత్రమైన అసెంబ్లీ భవనానికి ముఖ్యమంత్రి ఇలాంటి స్థితిలో రావడం సిగ్గుచేటని విమర్శించింది.
పంజాబ్ ప్రజల సమక్షంలో భగవంత్ మాన్‌కు వెంటనే డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని అకాలీ దళ్ నేతలు డిమాండ్ చేశారు.ఈ వివాదంపై ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ క్రమంలో అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రభుత్వ పదవీకాలం ముగియనున్న సమయంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వల్ల కార్మికులకు కలిగే ప్రయోజనం ఏంటని కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా ప్రశ్నించారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం . రాఘవ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
ఇటువంటి క్లిష్ట సమయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎంపై మద్యం ఆరోపణలు రావడం పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఈ రాజకీయ దుమారం పంజాబ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది




