Khammam
Trending

చింతకాని PACSకు లారీలు..

చింతకాని PACSకు లారీలు..

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చింతకాని PACSకు లారీలు.. ఆన్‌లైన్ కుట్రపై ఆగ్రహం…….

45 రోజులుగా కల్లాల్లోనే మొక్కజొన్న కుప్పలు.. బస్తాలు రాలేదు.. లోడై 24 గంటలుగా రోడ్డుపైనే లారీలు.. రైతుల-లారీ ఓనర్ల మధ్య వాగ్వాదం…

ఆన్‌లైన్ కుట్రపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు…

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

45 రోజులుగా కల్లాల్లోనే మొక్కజొన్న కుప్పలు మగ్గిపోతూ, మొక్కజొన్న బస్తాలు లేక, లోడై ఉన్న లారీలు 24 గంటలుగా రోడ్డుపైనే నిలిచిపోయి, రైతులు సహకార సంఘం సొసైటీల చుట్టూ తెల్లవార్లు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న చింతకాని PACS పరిధి రైతులకు కొంత ఊరట లభించింది. రైతుల ఆవేదనను గుర్తించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చింతకాని సొసైటీకి లారీలు మాత్రమే రావడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే మొక్కజొన్న బస్తాలు మాత్రం ఇంకా రాకపోవడంతో ఇబ్బందులు తొలగలేదని వాపోతున్నారు. గతంలో లారీల కొరత, బస్తాల కొరత సాకుతో అధికారులు చేతులెత్తేయడంతో చేసేది లేక రైతులే స్వయంగా రోడ్లపైకి వెళ్లి లారీలు తెచ్చుకొని లోడింగ్ చేసుకున్నారు. కానీ 24 గంటలు గడుస్తున్నా ‘ఆన్‌లైన్ కాలేదు’ అనే సాకుతో ఆ లారీలు రోడ్డుపైనే దిక్కులేకుండా నిలిచిపోయాయి. దీంతో లారీ ఓనర్లు “లోడ్ దించేస్తాం, 24 గంటలు ఎలా ఆగుతాం, మాకు నష్టం ఎవరు భరిస్తారు” అని రైతులపై మండిపడుతుండటంతో లోడై ఉన్న లారీలు 24 గంటలు రోడ్లపైనే గడుస్తున్న నేపథ్యంలో రైతుల-లారీ ఓనర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. ఇదంతా ఆన్‌లైన్ పేరుతో అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఆడుతున్న కుట్ర అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తాల టెండర్ దారు సకాలంలో మొక్కజొన్న బస్తాలు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సామాన్య రైతుకు లారీలు, బస్తాలు లేవంటారు కానీ, ప్రైవేట్ వ్యక్తులు, దళారులు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నాలుగైదు లారీల ధాన్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. లారీల టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పూర్తిగా చెల్లిస్తున్నా, కృత్రిమ కొరత సృష్టించి లారీ ఓనర్స్ ఒక్కో లారీకి రైతుల నుంచి 10 నుండి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. దళారుల ధాన్యానికి నిమిషాల్లో ఆన్‌లైన్ అవుతుంది, రైతు ధాన్యం మాత్రం రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటోందని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఆదేశాలు జారీ చేయడంతో లారీలు మాత్రమే రావడం, ధాన్యం తరలింపు కొంత మొదలవడంతో రైతులు కొంత ఊరట పొందారు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా డిటిఓ, ఏఎంవిఐ, ఇన్స్పెక్టర్లు, ఆర్టీవోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపైనే పడిగాపులు కాస్తూ రైతులకు సహకరిస్తున్నారు. దీంతో రైతులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే మొక్కజొన్న బస్తాలు వెంటనే సరఫరా చేయాలని, సీఈవో తమ సిబ్బందిని కార్యాలయానికి పంపించి రైతులకు సహకరించాలని, ఇకపై ఇలాంటి ఆన్‌లైన్ మాయాజాలం, అక్రమ వసూళ్లు, బస్తాల కొరత పునరావృతం కాకుండా చూడాలని, ఆన్‌లైన్ కుట్రపై సమగ్ర విచారణ జరిపి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై, అధికారుల తీరుపై విచారణ జరిపి అన్నదాతలకు న్యాయం చేయాలని రైతులు చేతులెత్తి వేడుకుంటున్నారు….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button