Khammam
Trending

రోడ్డు పక్కనే కుప్పలుగా కూల్ డ్రింక్ లు ఎలా వచ్చాయి?

రోడ్డు పక్కనే కుప్పలుగా కూల్ డ్రింక్ లు ఎలా వచ్చాయి?

ఎక్స్‌పైరీ కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లను గ్రామ శివార్లలో పడేస్తున్నది ఎవరు..?

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా..? అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 01 2026: ఏన్కూర్ మండల పరిధిలోని టిఎల్ పేట శివార్లలో, ముఖ్యంగా కాలువ కట్టల సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, మినరల్ వాటర్ బాటిళ్లు పడివుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని కంపెనీలకు చెందిన వందల సంఖ్యలో ప్లాస్టిక్ బాటిళ్లు ఒకేచోట పారవేయబడటం వెనుక ఎవరున్నారు అనే ప్రశ్న స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

గడువు ముగిసిన ఉత్పత్తులను నిబంధనల ప్రకారం ధ్వంసం చేయాల్సి ఉండగా, వాటిని రహస్యంగా గ్రామ శివార్లలో పడేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఈ ఎక్స్‌పైరీ కూల్‌డ్రింక్స్‌ను అక్రమంగా విక్రయించే ప్రయత్నం జరిగిందా? లేక వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి తరలించి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్ల పక్కన, కాలువ కట్టల వద్ద ఎక్కడపడితే అక్కడ ఈ బాటిళ్లను పారవేయడం అత్యంత నిర్లక్ష్యపూరిత చర్యగా స్థానికులు మండిపడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు వాటిని సాధారణ కూల్‌డ్రింక్స్‌గా భావించి తీసుకుని త్రాగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గడువు ముగిసిన పానీయాలను చిన్నపిల్లలు లేదా ఇతరులు పొరపాటున సేవిస్తే వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు పశువులు వాటిని తినే ప్రమాదం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ చెత్త కాలువల్లో కలిసిపోతే నీటి కాలుష్యం పెరిగి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గడువు ముగిసిన ఉత్పత్తులను సక్రమంగా నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వాటిని గ్రామ శివార్లలో పడేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్‌పైరీ ఉత్పత్తులు గ్రామ శివార్లకు ఎలా చేరాయనే విషయంపై సంబంధిత అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మండలంలోని కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఎక్స్‌పైరీ ఉత్పత్తుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు అధికారులు వెంటనే స్పందించి గ్రామ శివార్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

త్వరలో మరిన్ని సమాచారంతో వేలుగులోకి మీ ముందుకు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button