
42 ఏళ్ల నిరీక్షణకు తెర..
మారుమూల విద్యార్థులకు వరం..
ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గిరిజన బాలుర వసతిగృహం ప్రారంభం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 10 2026: నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా సేవలు అందిస్తున్న ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గిరిజన బాలుర వసతిగృహం ప్రారంభం కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రారంభమై 42 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతకాలం వసతిగృహం లేకపోవడం వల్ల మారుమూల గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు. ఈ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
వసతిగృహ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలు పొంగించి శుభారంభం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సింహాచలం రిబ్బన్ కట్ చేసి వసతిగృహాన్ని ప్రారంభించారు. తోరణాలతో అలంకరించిన వసతిగృహంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సింహాచలం మాట్లాడుతూ, కళాశాలకు హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని, ముఖ్యంగా దూర ప్రాంతాల విద్యార్థులు నిత్యం రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వసతిగృహం మంజూరు చేయించారని పేర్కొన్నారు.
హాస్టల్ ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత శాఖలందరికీ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న మొత్తం 40 మంది విద్యార్థులకు వసతిగృహ సదుపాయం కల్పిస్తున్నామని, వారికి సరిపడా పడకలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సీఎల్ఆర్సీ భవనాన్ని వసతిగృహంగా అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు.
హాస్టల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం స్టడీ అవర్ నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రతిరోజూ ఒక్కో అధ్యాపకుడిని బాధ్యతగా నియమిస్తామని వివరించారు.
మారుమూల గ్రామాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని, అలాంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వసతిగృహం ఏర్పాటు కోసం కళాశాల అధ్యాపక బృందం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో వసతిగృహం సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపాల్ సింహాచలంను కళాశాల అధ్యాపకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. హాస్టల్ ప్రారంభంతో ఇకపై మరింత మంది గ్రామీణ, గిరిజన విద్యార్థులు కళాశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.




