
ఖమ్మంలో దారుణం.. మనిషి బ్రతికుండగానే చనిపోయాడంటూ అప్పగించిన ప్రైవేట్ ఆసుపత్రి!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే, చనిపోయాడంటూ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించిన వైనం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..?
మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ధారావత్ మధుసూదన్‌రావు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేర్పించినప్పటి నుండి బ్రెయిన్ సర్జరీ చేయాలని, అది చేయాలని చెప్తూ వైద్యులు దాదాపు రూ. 3 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. అయితే, శనివారం నాడు ఆ యువకుడు మృతి చెందాడంటూ వైద్యులు తేల్చి చెప్పేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియల వేళ మిరాకిల్!
కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుటుంబ సభ్యులు మధుసూదన్‌రావు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కిష్టాపురానికి తీసుకువచ్చారు. దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న తరుణంలో.. ఒక్కసారిగా యువకుడి గుండెల్లో కదలిక రావడాన్ని, గుండె స్పందించడాన్ని గమనించిన బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ డాక్టర్ల నిర్ధారణ.. హైదరాబాద్‌కు తరలింపు
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యువకుడిని పరీక్షించగా, అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ప్రస్తుతం మధుసూదన్‌రావుకు మెరుగైన వైద్యం అందించడం కోసం అత్యవసరంగా అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ‘డబ్బులు గుంజేసి, బ్రతికున్న మనిషిని చనిపోయాడని చెప్తారా?’ అంటూ మధుసూదన్‌రావు బంధువులు సదరు ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




