
భవనం ఉంది… విద్యార్థులే కరువు
ప్రధాన కేంద్రానికి దూరంగా ‘భవిత’ కేంద్రం
విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు..
ఉపాధ్యాయుడు కాలక్షేపమేనని ఆరోపణలు
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 23 2026: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల కోసం ప్రభుత్వం ఆధునిక వసతులతో నిర్మించిన ‘భవిత’ ప్రత్యేక విద్యామూల్యాంకన కేంద్రం విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల ప్రధాన కేంద్రానికి సుమారు కిలోమీటర్ దూరంలో, ఐకేపీ కార్యాలయ భవనం పక్కన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ కేంద్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు అనుకూలంగా విశాలమైన తరగతి గదులు, ర్యాంపులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఫ్యాన్లు, ప్రశాంతమైన వాతావరణం వంటి అన్ని వసతులు ఏర్పాటు చేశారు. చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన బోధన, శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
అయితే కేంద్రం మండల కేంద్రానికి దూరంగా ఉండడం, విద్యార్థులకు ప్రత్యేక రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది చిన్నారులు కేంద్రానికి రావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులను ప్రతిరోజూ అంత దూరం తీసుకురావడం కుటుంబాలకు భారంగా మారిందని చెబుతున్నారు. ఫలితంగా కేంద్రానికి విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటోందని అంటున్నారు.
విద్యార్థులు రాకపోవడంతో అక్కడ విధులు నిర్వహించే ప్రత్యేక ఉపాధ్యాయుడు రోజంతా ఫ్యాన్ కింద కూర్చొని కాలక్షేపం చేసి తిరిగి వెళ్లిపోతున్నారని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రం ఖాళీగా ఉండటం బాధాకరమని, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ఆశించిన ప్రయోజనాన్ని అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయడం లేదా రవాణా భత్యం కల్పించడం, అలాగే కేంద్రాన్ని మండల ప్రధాన కేంద్రానికి సమీపంలోని అందుబాటు ప్రాంతానికి మార్చడం ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.




