
కేబుల్ మాయం.. తాగునీకి అంతరాయం
కేబుల్ చోరీలతో గ్రామపంచాయతీకి తలనొప్పి
గ్రామపంచాయతీ మోటార్ కేబుళ్లపై దొంగల కన్ను
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 29 2026: మండల పరిధిలోని సూర్య తండా గ్రామపంచాయతీ మర్సకుంట గ్రామంలో గ్రామపంచాయతీ ఆస్తులపై వరుసగా జరుగుతున్న చోరీలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి స్మశానవాటికలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ మోటార్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించగా, ఆ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చోరీలు ఆగకపోవడం గమనార్హం.
అనంతరం సుమారు పది రోజుల క్రితం గ్రామంలోని తాగునీటి మోటార్‌కు సంబంధించిన కేబుల్‌ను దుండగులు దొంగిలించారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి మరోసారి అదే గ్రామంలో గ్రామపంచాయతీ మోటార్‌కు సంబంధించిన కేబుల్‌ను చోరీ చేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ గ్రామపంచాయతీ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని చోరీలు జరుగుతున్నప్పటికీ దుండగులను ఇప్పటివరకు గుర్తించకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇకనైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో రాత్రివేళల్లో పోలీసు గస్తీ పెంచడంతో పాటు గ్రామపంచాయతీ ఆస్తులకు తగిన భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.




