
మధ్యాహ్నపు చారే సాయంత్రం వడ్డిస్తారా?..
విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యం.. వార్డెన్‌కు ఎంపీ రఘురాం రెడ్డి హెచ్చరిక!
దమ్ముపేట బాలికల పాఠశాలలో అపరిశుభ్ర స్టాక్ రూమ్‌లు.. మెనూ ఉల్లంఘనపై సీరియస్
సి కె న్యూస్ ప్రతినిది
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గిరిజన బాలకల రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ భవన సముదాయాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా పాల్గొని విద్యార్థుల వసతి, భోజన వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు నేరుగా వంటశాల వద్దకు వెళ్లి, అప్పటికే వండి ఉన్న అన్నం, చిక్కుడుకాయ కూర, చారును స్వయంగా పరిశీలించారు. అయితే, మెనూ ప్రకారం సాయంత్రం వేళ సాంబారు, కోడిగుడ్లు అందించాల్సి ఉండగా.. మధ్యాహ్నం వండిన చారునే సాయంత్రం కూడా పిల్లలకు వడ్డిస్తుండడాన్ని వారు గుర్తించారు. దీనిపై ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం స్టాక్ రూమ్‌ను పరిశీలించగా.. కూరగాయలు, పండ్లు అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసి ఉండడం వారి దృష్టికి వచ్చింది. బాధ్యురాలైన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడవద్దని, పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే సహించేది లేదని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.




