
పీఎస్‌ఐని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. వీడియో వైరల్..
social media viral : బెంగళూరు: శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 12న రాత్రి ఆరతి ఉక్కడ ఆలయానికి తుమకూరు రూరల్ ఎమ్మెల్యే బి.ఎస్.సురేశ్‌గౌడ కుమార్తె ఐశ్వర్య వెళ్లారు. గర్భగుడిలోకి వెంటనే అనుమతించకపోవడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మండ్య మహిళా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పీఎస్ఐ సవితా బి.పాటిల్‌తో ఆమె తీవ్ర వాగ్వాదం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
వాగ్వాదం ముదరడంతో సవితా పాటిల్‌ను ఐశ్వర్య చెంపదెబ్బ కొట్టగా.. అనంతరం పీఎస్ఐ కూడా ఆమెను కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్న పోలీసులు, భక్తులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అంతకుముందు ఐశ్వర్య ఎవరికో ఫోన్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనపై కైతనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పీఎస్ఐ సవితా పాటిల్ ఫిర్యాదు చేశారు. తనను దూషించడంతో పాటు చెంపదెబ్బ కొట్టి, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే ఘటనకు సంబంధించి ఐశ్వర్య తరఫున ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని తెలుస్తోంది.
ఎమ్మెల్యే క్షమాపణలు..మరోవైపు ఎమ్మెల్యే సురేశ్‌గౌడ తన కుమార్తె తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే ఆలయంలో తన కుమార్తెను పోలీసులు గర్భగుడిలోకి అనుమతించలేదని, అదే సమయంలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను మాత్రం లోపలికి అనుమతించారని ఆయన ఆరోపించారు.
పీఎస్ఐ తన కుమార్తెను దూషించినట్లు తెలిసిందని, ఆ తర్వాతే ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు. తన కుమార్తె పోలీసు అధికారిని కొట్టిన దృశ్యాలను తాను చూడలేదని చెప్పిన ఎమ్మెల్యే.. జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై పోలీసుల చర్యలు, ఇరువర్గాల ఫిర్యాదుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.




