
మహిళా ఉద్యోగినిపై ఐఏఎస్ అధికారి దురుసు ప్రవర్తన…
Web desc : జమ్మూ కశ్మీర్లో జరిగిన ఓ వర్చువల్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ మీటింగ్కు సంబంధించిన వీడియో ఒకటి లీకై తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన కిందిస్థాయి మహిళా అధికారితో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, బూతులు తిడుతూ సస్పెండ్ చేస్తానని బెదిరించిన వైనంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ యువత సాధికారత పథకం ‘మిషన్ యువా’ అమలు తీరును సమీక్షించేందుకు బుధవారం ఈ వర్చువల్ సమావేశం జరిగింది.
జమ్మూ కశ్మీర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్న కుమార్ రాజీవ్ రంజన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీకి గందర్బల్ ఎంప్లాయ్మెంట్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న 2015 బ్యాచ్ జేకేఏఎస్ అధికారి బీనిష్ వానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
సమావేశంలో భాగంగా బీనిష్ వానీ తన కార్యాలయం సాధించిన లక్ష్యాల గురించి వివరిస్తుండగా.. డిపార్ట్మెంటల్ పనుల్లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పాత్రేమిటని రంజన్ ప్రశ్నించారు. వేరే ఏజెన్సీ ప్రమేయం ఎందుకని ఆయన నిలదీశారు. దీనిపై బీనిష్ వానీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, రంజన్ ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ మాట్లాడవద్దని అరిచారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా అధికారిపై రంజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నేను నీ బాస్ను, నీతో ఇలాగే మాట్లాడగలను, స్టూపిడ్” అని హెచ్చరించడమే కాకుండా, అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో దూషించారు. ఆమె అతని భాషను ప్రశ్నించిన తర్వాత అతను వాణిని “బ్లడీ షిట్” అని కూడా తిట్టాడు.
దీనికి బీనిష్ వానీ గట్టిగా బదులిస్తూ.. తనతో అలా మాట్లాడే హక్కు మీకు లేదని, “టూ హెల్ విత్ యు” అంటూ తిప్పికొట్టారు. అంతటితో ఆగని ఆ ఐఏఎస్ అధికారి.. తన కార్యాలయ సిబ్బందిని వెంటనే ఆమెపై సస్పెన్షన్ ఆర్డర్ సిద్ధం చేయాలని, సర్వీస్ నుంచి తొలగించాల్సిందిగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు లేఖ రాయాలని హుకుం జారీ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. పీడీపీ నేత ఇల్తియా ముఫ్తీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. స్థానిక అధికారులపై అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ఐఏఎస్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను డిమాండ్ చేశారు.
కశ్మీర్లో స్థానిక అధికారులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. మరోవైపు, ఈ వీడియోను తొలుత ఏఐ (AI)-సృష్టించినదిగా లేదా కల్పితమైనదిగా శాఖాపరంగా బుకాయించే ప్రయత్నం జరిగిందని, అయితే సమావేశానికి హాజరైన ఇతర అధికారులు ఇది ముమ్మాటికీ అసలు వీడియోనేనని ధ్రువీకరించినట్లు జేకేఏఎస్ అసోసియేషన్ తెలిపింది. రంజన్ వ్యవహారశైలిపై నిష్పక్షపాత విచారణ జరిపించి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది.




