
చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.1.50 కోట్లతో నిర్వాహకుడు పరార్!
Web desc :చిట్టీల వ్యాపారం పేరుతో అమాయకులను నమ్మించి భారీ మోసానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో కలకలం రేపింది. చిట్టీలు వేసిన సుమారు 50 మంది బాధితులకు డబ్బులు చెల్లించకుండా, వారే తనకు అప్పులు ఇచ్చారంటూ నిర్వాహకుడు ఐపీ పెట్టి కోర్టు ద్వారా నోటీసులు పంపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో సుమారు రూ.1.50 కోట్ల మేర మోసం జరిగినట్లు వారు చెబుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మున్సిపల్ కేంద్రానికి చెందిన మహమ్మద్ అజీద్ అహమ్మద్ కొంతకాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో మున్సిపల్ పరిధిలోని బీడీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలు, వృద్ధులు, పేద కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది అతని వద్ద చిట్టీలు వేశారు. చిట్టీలు పూర్తయి డబ్బులు తీసుకోవాల్సిన సమయంలో బాధితులు తమ సొమ్ము అడగడంతో నిర్వాహకుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడని వారు ఆరోపిస్తున్నారు.
మూడు రోజుల క్రితం చిట్టీలు వేసిన వ్యక్తులే తనకు అప్పులు ఇచ్చారని పేర్కొంటూ, ఆ అప్పులు చెల్లించే పరిస్థితి లేదని నిర్వాహకుడు ఐపీ దాఖలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు కోర్టు ద్వారా నోటీసులు అందడంతో బాధితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ చిట్టీ డబ్బులు చెల్లించాల్సిన వ్యక్తే తిరిగి తమపై అప్పుల ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చిట్టీల నిర్వాహకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగాయి.
అయితే బాధితులు ఆందోళనకు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న నిర్వాహకుడు ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు సోమవారం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. తమకు రావాల్సిన చిట్టీ డబ్బులు ఇప్పించి, బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



