
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాల మధ్య ఇవాళ మరో కలకలం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 7న నాంపల్లి ప్రాంతంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, ఎవరినీ ల్యాబ్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
కాగా.. ఉదయం 10:00 గంటల ప్రాంతంలో మొదటి ఫ్లోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఫ్లోర్‌లోని కంప్యూటర్లు, ఫోరెన్సిక్ సంబంధిత కెమికల్స్‌తో సహా కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి.
ఈ ఘటనలో పలు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మంటల్లో ఫోన్ ట్యాపింగ్‌కు కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులూ కాలిపోయినట్లు సమాచారం.



