KhammamPoliticalTelangana

తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు – మంత్రి తుమ్మల

తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు – మంత్రి తుమ్మల

తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు – మంత్రి తుమ్మల

నర్మేట్టలో రూ.300 కోట్లతో అత్యాధునిక పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం

కేవలం 18 నెలలలోనే ఫ్యాక్టరీ పనులు పూర్తి చేశాము – మంత్రి తుమ్మల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్న నర్మేట్ట ఫ్యాక్టరీ

పామాయిల్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం – మంత్రి తుమ్మల

నర్మేట్ట ఫ్యాక్టరీతో పెరగనున్న రైతుల ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు

తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు, ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

రైతుల ఆర్థికాభివృద్ధికి దీర్ఘకాలిక భరోసా ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందని, ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాలపాటు నిరంతర ఆదాయం అందించే ఈ పంట తెలంగాణ రైతులకు బంగారు భవిష్యత్తును అందించగలదని మంత్రి పేర్కొన్నారు.

శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మరియు అధికారులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.

ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించిన మంత్రి, ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త దశను తీసుకువస్తుందని పేర్కొన్నారు.

అత్యాధునిక మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. గంటకు 30 నుండి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆయిల్ పామ్ పనులు ప్రారంభించి, కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పనులు పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ పామ్ రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం పంట మార్పిడి అవసరం ఏర్పడిందన్నారు. రైతులు వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరియు సన్నాలకు ఇచ్చే బోనస్ కారణంగా దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పరిమితులు విధిస్తున్న నేపథ్యంలో రైతులు వరి మాత్రమే కాకుండా ఉద్యానపంటలు, కూరగాయలు, పామాయిల్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు అధిక ఆదాయం పొందే ప్రత్యామ్నాయ పంటగా పామాయిల్ పంట ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజికాయ, మెకడామియా వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

మార్కెట్ పరంగా కూడా ఈ పంట రైతులకు సులభంగా ఉండే పంటగా నిలుస్తుందని, పండిన గెలలను ఫ్యాక్టరీకి విక్రయించిన తరువాత మూడో రోజుకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ధాన్యం అమ్మకాలలో కొన్ని సందర్భాల్లో చెల్లింపులు ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉండొచ్చని, అయితే పామాయిల్ రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.

అదేవిధంగా ఆయిల్ పామ్ పంటకు కోతుల బెడద, అడవి పందుల బెడద, అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోయే సమస్యలు తక్కువగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

పామాయిల్ సాగు చేయాలనుకునే రైతులకు రూ.50,921 వరకు సబ్సిడీ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మొక్కలను ఉచితంగా అందజేస్తున్నామని, డ్రిప్ పరికరాలను కూడా ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు.

తాను మంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలో పామాయిల్ ధర టన్నుకు రూ.12,000 మాత్రమే ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి దిగుమతి సుంకాన్ని పెంచేలా చేయడంతో ప్రస్తుతం టన్నుకు రూ.21,546 కు చేరిందన్నారు. దీనిని రూ.25,000కు పెంచాలని ప్రధానమంత్రిని కోరుతున్నామని తెలిపారు.

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో మరింత నమ్మకం పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణకు ఈ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఆయిల్ రిఫైనరీ యూనిట్‌కు గౌరవ ముఖ్యమంత్రిగారు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 14 కంపెనీలు ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ పరిధిలోనే దాదాపు 42758 మంది రైతులు 1.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాలోనే 14361 ఎకరాల్లో 4,469 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, జనగామ, యాదాద్రి భువనగిరి, గద్వాల్, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల్లో కలిపి 49376 ఎకరాల్లో 13479 మంది రైతులు సాగు చేస్తున్నారని వివరించారు.

భారతదేశంలో వంట నూనెలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం సుమారు 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి అవుతున్నాయని మంత్రి తెలిపారు. అందులో దాదాపు 59 శాతం పామాయిల్ వాటానే అని పేర్కొన్నారు.

గత ఏడాది మాత్రమే దేశం లక్షా 38 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, ఇందులో పెద్ద భాగం పామాయిల్‌దేనని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ సాగును విస్తరించడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందు రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా రైతుల సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వద్ద వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ సాగు, ప్రాసెసింగ్ విధానాలపై రైతులకు వివరాలు అందించాలన్నారు.

అలాగే ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా చర్చించేలా డైరెక్ట్ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఎకరానికి సుమారు 57 మొక్కలు నాటాల్సి ఉంటుందని, నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని చెప్పారు.

ఒకసారి సాగు ప్రారంభమైతే 25 నుండి 40 సంవత్సరాలపాటు దిగుబడి ఇస్తుందని వివరించారు. అంతర పంటలుగా కోకో, జాజికాయ, మెకడామియా వంటి పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.

పామాయిల్ సాగు ద్వారా రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రానున్న రోజుల్లో తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు

ఈ లక్ష్యం సాధ్యమైతే తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ముందంజలో నిలవడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతాంగం అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆయిల్ పామ్ సాగు విస్తరణతో రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button