
LB నగర్లో పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపేశ్ గుప్తా నగర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటిలో ఎయిర్ కండిషనర్ (AC) అకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు చెలరేగి స్థానికంగా వ్యాపించాయి.
దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు.
అయితే మంటలను ఆర్పే ప్రయత్నంలో ఫైర్ సిబ్బందిలో కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఏసీ పేలుడే మంటలకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు, ఘటనపై మరింత విచారణ చేపట్టినట్లు తెలిపారు.




