
మహిళ దారుణ హత్య.. రాత్రంతా మృతదేహం పక్కనే మూడేళ్ల చిన్నారి రోదన
ఓ మహిళ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదంలో ఆ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామ పంచాయతీ రంగారెడ్డి గూడాకు చెందిన పోతుల శోభారాణి(30) వివాహం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో 10 సంవత్సరాల క్రితం జరిగింది.
అదే గ్రామానికి చెందిన నరసింహులుతో శోభారాణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధంలో గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో నెలరోజుల క్రితం శోభారాణి భర్త రాజును వదిలేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి వచ్చింది. అప్పటి నుంచి నరసింహులు శోభారాణి ని వివాహం చేసుకుంటానని కుల పెద్దలతో భర్తతో మాట్లాడాడు.
దీంతో ఆగ్రహానికి గురైన భర్త రాజు శోభారాణిని శనివారం రాత్రి అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డి గూడా – తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేశాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు గోవిందుకు చిన్నారి రోదిస్తూ కనిపించింది.
ఏమి జరిగిందని ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఓ మహిళ శవం కనిపించింది. రైతు వెంటనే జరిగిన విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. శోభారాణి కూతురు మూడేళ్ల చిన్నారి తల్లి మృతదేహం వద్ద రాత్రంతా రోదిస్తుండటం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
సమాచారం అందుకున్న షాద్ నగర్ సీఐ సీతారాం సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




