
మహిళల్లో అక్షరాస్యత పెంపునకు సెర్ప్ ప్రత్యేక చర్యలు
అమ్మకు అక్షరమాల కార్యక్రమానికి విశేష స్పందన
అక్షరానికి మించిన ఆయుధం లేదు..ఆడబిడ్డలంతా అక్షరమాల కార్యక్రమంలో చేరండి – మంత్రి సీతక్క
హైదరాబాద్
మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మకు అక్షరమాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది.
ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాల (SHGs) సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదరణ పొందుతోంది. చదువుకోలేక వెనుకబడిన మధ్యవయసు, వృద్ధ మహిళలకు మరోసారి విద్యా అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
కుటుంబ బాధ్యతల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన మహిళలు తిరిగి పుస్తకాలు పట్టడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామ స్థాయిలోనే SHGs ఆధారంగా తరగతులు నిర్వహించడం వల్ల మహిళలు సౌకర్యవంతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,01,357 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమం లో చదువు నేర్చుకోట..ఆదివారం నిర్వహించిన అక్షరాస్యత పరీక్ష కు 6,31,656 మంది హాజరయ్యారు.
అంటే 90 శాతం మంది మహిళలు పరీక్ష రాయడం ఈ కార్యక్రమంపై మహిళల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ లేదా మే మాసంలో వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు పదో తరగతి (SSC) పరీక్షలకు హజరు కావచ్చు.
ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛంద సేవా భావంతో అమలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో వాలంటీర్లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (CRPs) ముందుకు వచ్చి మహిళలకు అక్షరజ్ఞానం అందిస్తున్నారు.
ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించి, వారికి స్థానికంగా 8 నుంచి 10 మంది వాలంటీర్లు శిక్షణ ఇచ్చారు. కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా ఉండడం వల్ల సహజ వాతావరణంలో నేర్చుకునే అవకాశం కలిగింది.
ఈ కార్యక్రమంలో బోధనా విధానం మహిళలు చాలా సులభంగా నేర్చుకునే విధంగా ఉంది. 16 వారాల శిక్షణ కార్యక్రమం 2025 అక్టోబర్లో ప్రారంభమైంది. నోటుబుక్స్, ప్రాథమిక అభ్యాస సాధనాలను ఉచింతంగా అందచేశారు.
పాఠ్య విధానం పూర్తిగా పుస్తకాలకు పరిమితం కాకుండా విజువల్, అభ్యాసాత్మక పద్ధతులను సమ్మిళితం చేస్తూ ఉంటుంది. గుర్తులు, చిత్రాలు, తెలిసిన అంశాలను ఉపయోగించి అక్షరాస్యతకు సంబంధించిన ప్రాథమిక భావాలను సులభంగా అర్థమయ్యేలా బోధించారు.
దీంతో మహిళలు మొదట తమ పేర్లు, గ్రామం, జిల్లా పేర్లను గుర్తించడం నుంచి ప్రారంభించి, క్రమంగా చదవడం, వ్రాయడం వైపు దశలవారీగా ముందుకు సాగారు. ఈ క్రమబద్ధమైన విధానం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, అక్షరజ్ఞానంపై పట్టును పెంచింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వయోజన విద్యాశాఖతో సమన్వయం చేస్తూ అమలు చేశారు.
వాలంటీర్లు, ఫెసిలిటేటర్లకు వివిధ స్థాయిల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయిలో కమ్యూనిటీ వాలంటీర్లు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సంస్థ ప్రతినిధులు కలిసి శిక్షణ పొందారు. దీని ద్వారా బోధనలో ఒక రకమైన ప్రమాణీకరణ, నాణ్యతను నిర్ధారించారు.
ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులైన మహిళలకు పదో తరగతి (SSC) పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించడం ద్వారా వారి విద్యా ప్రస్థానానికి కొత్త దిశను ప్రభుత్వం చూపుతోంది. దీని ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా, స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు.
అక్షరాస్యతతో మహిళలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడం, బ్యాంకింగ్ లావాదేవీలు స్వయంగా నిర్వహించడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం వంటి అంశాల్లో ముందుకు వస్తున్నారు. కుటుంబం, సమాజంలో వారి పాత్ర మరింత బలపడుతోంది.
జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యతలో ఇంకా లింగ వ్యత్యాసం కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో అమలవుతున్న ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోంది.
మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న “కోటి మందిమహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలి” అనే ప్రభుత్వ సంకల్పానికి అక్షరాస్యత బలమైన పునాదిగా మారుతోందని, మహిళల జీవితాల్లో దీర్ఘకాలిక సానుకూల మార్పులకు దారితీస్తోందని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు.
అక్షరానికి మించిన ఆయుధం లేదు..ఆడబిడ్డలంతా అక్షరమాల కార్యక్రమంలో చేరండి – మంత్రి సీతక్క
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, మహిళల సాధికారతకు అక్షరాస్యతే కీలకమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి మహిళ చదువుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. “అక్షరానికి మించిన ఆయుధం లేదు. చదువు ద్వారా మహిళలు తమ జీవితాలను స్వయంగా మార్చుకునే శక్తిని పొందుతారు” అని ఆమె పేర్కొన్నారు.
స్వయం సహాయక బృందాల మహిళలు చూపుతున్న చురుకుదనం అభినందనీయమని, వారి భాగస్వామ్యం సమాజంలో పెద్ద మార్పునకు నాంది అవుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు కేవలం చదవడం, వ్రాయడం మాత్రమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడుతున్నారని వివరించారు.
అక్షరాస్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళలు పదో తరగతి, ఆ పైచదువులు చదివేలా ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అందిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆడబిడ్డల అక్షరాస్యత కోసం పాటు పడుతున్న సెర్ప్, రూరల్ డెవలప్ మెంట్, వయేజన విద్యా శాఖల సిబ్బందిని మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు.



