
కోడలిని ఇంట్లోకి రానివ్వని అత్త-మామ… ఇంటి ముందు కూర్చొని ధర్నా
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. దాదాపు 18 రోజుల నుంచి భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి ఓ మహిళా ఆందోళన నిర్వహిస్తోంది. భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆరు బయటే నివాస ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ హనుమాన్ జంక్షన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన శేఖర్ తో దీనా కుమారికి 16 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. భర్త అనారోగ్యంతో నెల రోజుల కిందట మృతి చెందారు. స్వస్థలంలో కార్యక్రమాలు పూర్తి చేసుకొని మాదాపూర్ లో ఇంటికి చేరుకున్న దీనా కుమారికి అత్తగారింటికి నో ఎంట్రీ దర్శనమిచ్చింది.
ఇంట్లోకి రానివ్వడం లేదని పిల్లలతో కలిసి బాధితురాలు దీనా కుమారి దాదాపు 18 రోజులుగా ఇంటి బయటే ఉంటుంది. దీంతో ఆందోళనకు దిగిన దీనా కుమారికి మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కొడుకుపోయాక నీతో సంబంధం లేదంటున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలు తమ వారసులే అనడానికి డీఎన్ఏ రిపోర్ట్ అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఇంటి బయటే ఉంటున్న దీనా కుమారికి మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది.
మరోవైపు ఈ విషయం పై దీనా కుమారి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మాదాపూర్ ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. దీనా కుమారి కి గతంలో ఇంకొ వ్యక్తితో వ్యవహారం జరిగిందని.. ఆ తర్వాత తమ కుమారుడికి వివాహం చేసుకుందని దీనా కుమారి అత్తమామలు పేర్కొనడం గమనార్హం.




