
కాంగ్రెస్ నేత జావీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం: నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావీద్ కుటుంబ సభ్యులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం పరామర్శించారు. జావీద్ నివాసానికి చేరుకున్న ఎంపీ, అక్కడ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జావీద్ కుమార్తెలు షెహలా జావీద్, మదిహలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. మహమ్మద్ జావీద్‌తో తనకు ఎంతో కాలంగా సన్నిహిత, వ్యక్తిగత అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిరంతరం శ్రమించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని, జావీద్ మరణం పార్టీకి, నగరానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో..: నగర కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ చౌదరి, డీసీసీ సెక్రటరీ ముక్రం అలీ ఖాన్, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




