
రైతు భూములకు సారవంతమైన చెరువు మట్టి
పూడిక తీత పనులకు అనుమతులు – ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవం ఘన ముగింపు
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 09 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజులపాటు నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కేసుపల్లి గ్రామ పరిధిలోని సవిటి చెరువులో పూడిక తీత పనులకు అధికారికంగా అనుమతులు జారీ చేశారు. చెరువులో తీయబడుతున్న పూడిక మట్టిని రైతులు తమ వ్యవసాయ భూములకు తరలించుకొని వెళ్లేందుకు అనుమతి కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చెరువుల పూడికను వ్యవసాయ భూములకు తోడుకోవడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని వివరించారు. చెరువు మట్టిలో సహజసిద్ధమైన సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండటంతో భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని, దాంతో నేల నాణ్యత మెరుగుపడటమే కాకుండా పంటల దిగుబడులు కూడా అధికమయ్యే అవకాశముందని తెలిపారు. అలాగే భూమిలో సేంద్రియ కర్బనం పెరగడం వల్ల రైతులు వినియోగించే రసాయన ఎరువుల పరిమాణం తగ్గి, ఎరువుల సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ భూముల్లో చెరువు మట్టిని వినియోగించడం ద్వారా నేల తేమ నిల్వ ఉండటానికి కూడా ఉపయోగపడుతుందని, దీని వలన నీటి వినియోగం తగ్గి రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని అధికారులు వెల్లడించారు. రైతులు ఆధునిక పద్ధతులతో పాటు ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానాలను కూడా అనుసరించాలని సూచించారు.
అదేవిధంగా మొక్కజొన్న, మిర్చి, పత్తి వంటి పంటల అవశేషాలను పొలాల్లో తగలబెట్టడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించారు. పంట అవశేషాలను కాల్చడం వలన భూమిలో ఉండే సూక్ష్మ జీవులు నశించి భూసారం తగ్గిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వాయు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. పంట అవశేషాలను సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు సూచించారు.
వారం రోజులపాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవం ద్వారా రైతులకు పలు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్, నీటిపారుదల శాఖ ఉప విభాగ అధికారి కిషోర్, సహాయ కార్యనిర్వహణ అధికారి నవీన్, వ్యవసాయ అధికారి నర్సింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారి భవ్యతో పాటు ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




