
నేను చనిపోలేదు… బ్రతికే ఉన్నాను
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన కొండ్రు రాములమ్మ ఆవేదన
నేను చనిపోలేదు సార్… బ్రతికే ఉన్నాను అంటూ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది ఓ వృద్ధురాలు. భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పింఛన్ కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆమెకు చివరకు ఎదురైన సమాధానం మాత్రం షాకింగ్‌గా మారింది.
పింఛన్ కోసం దరఖాస్తు చేసిన కొండ్రు రాములమ్మను అధికారులు ఆన్‌లైన్‌లో ‘మరణించిన వ్యక్తి’గా నమోదు చేశారు. దీంతో పింఛన్‌తో పాటు రేషన్ బియ్యం కూడా నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన కొండ్రు రాములు రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఆయన భార్య రాములమ్మ వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది.

అప్పటి నుంచి పింఛన్ వస్తుందనే ఆశతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. నాయకులను, అధికారులను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వాపోతోంది. ఇటీవల రాములమ్మ మనవడు ఆన్‌లైన్‌లో పింఛన్ స్టేటస్ పరిశీలించగా, ఆమె పేరును ‘మరణించిన వ్యక్తి’గా నమోదు చేసినట్లు బయటపడింది.
అంతేకాకుండా ఎవరూ దరఖాస్తు చేయకుండానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. బ్రతికుండగానే నన్ను చంపేశారు సార్” అంటూ రాములమ్మ అధికారుల కాళ్లపై పడుతూ వేడుకోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మండల పరిషత్ కార్యాలయానికి పింఛన్ కోసం వెళ్లిన వృద్ధురాలికి ఎదురైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
రఘునాథపాలెం మండలంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వాటిని సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన కొమ్ము పుల్లయ్యకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఐదు సంవత్సరాల క్రితం ఆయన భార్య పుల్లమ్మ మృతి చెందగా, అధికారులు పొరపాటున పుల్లయ్యనే చనిపోయినట్లు నమోదు చేసి డెత్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది.
అప్పటి నుంచి పింఛన్ కోసం తిరుగుతున్న పుల్లయ్యకు, మీరు చనిపోయినట్లుగా స్టేటస్‌లో ఉంది అని అధికారులు చెప్పడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. ఒకే గ్రామంలో ఇద్దరిని బ్రతికుండగానే చనిపోయినట్లుగా నమోదు చేయడం ఎలా జరిగిందనే దానిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తప్పిదమా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాములమ్మ, పుల్లయ్య ఇద్దరూ పింఛన్‌కు అర్హులేనని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీడీవో వివరణ…
ఒకే గ్రామంలో ఇద్దరిని చనిపోయినట్లుగా నమోదు చేసి డెత్ సర్టిఫికెట్లు జారీ కావడంపై స్థానిక ఎంపీడీవో అశోక్‌ను సంప్రదించేందుకు ‘దిశ’ ప్రయత్నించగా, ఆయన ఫోన్‌కు స్పందించలేదు.
మంచి పద్ధతి కాదు… సుశీల, స్థానికురాలు
మా గ్రామంలో బ్రతికుండగానే ఓ వృద్ధురాలిని చనిపోయిందని నమోదు చేయడం దారుణం. పింఛన్ రాకపోయినా పర్వాలేదు కానీ బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చూపించడం చాలా బాధాకరం. అధికారులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకుని రాములమ్మకు పింఛన్ వచ్చేలా చూడాలి.
నా భార్య చనిపోతే నన్నే చంపేశారు.. కొమ్ము పుల్లయ్య
ఐదు సంవత్సరాల క్రితం నా భార్య పుల్లమ్మ చనిపోయింది. అప్పటి నుంచి పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. తీరా చూస్తే నేను చనిపోయినట్లుగా నమోదు చేశారని తెలిసి కంగుతిన్నాను. ఇప్పుడు రాములమ్మ పరిస్థితి కూడా అలాగే ఉండటంతో బయటకు వచ్చాను. మాకు న్యాయం చేసి పింఛన్ ఇప్పించాలి.




