Khammam
Trending

ఫోటోలకే పరిమితమైన తనిఖీలు.

ఫోటోలకే పరిమితమైన తనిఖీలు.

ఫోటోలకే పరిమితమైన తనిఖీలు..

తూతూ మంత్రంగా అధికారుల పర్యవేక్షణ

ప్రభుత్వ ధర రూ.266.. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారంటూ రైతుల ఆరోపణ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్), గ్రోమోర్‌లో ప్రభుత్వ ధరకే విక్రయాలు..

ప్రైవేట్ దుకాణాల్లోనే అధిక ధరల వసూళ్లు జరుగుతున్నాయని రైతుల ఆవేదన

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 16 2026: సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళనతో ఇప్పటికే రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే ఆరోపణలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. ప్రకృతి ఒకవైపు పరీక్షిస్తుంటే, మరోవైపు అధిక ధరల భారం రైతుల నడ్డివిరుస్తోందని వారు వాపోతున్నారు.
మండలంలోని కొన్ని ఫెర్టిలైజర్ దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 45 కిలోల యూరియా బస్తాకు గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) రూ.266గా నిర్ణయించినప్పటికీ, కొన్ని ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో ఒక్కో బస్తాకు రూ.300 లేదా అంతకుమించి వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్), గ్రోమోర్ కేంద్రాల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా విక్రయిస్తున్నారని, సమస్య ప్రధానంగా కొన్ని ప్రైవేట్ దుకాణాల్లోనే ఉందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం యూరియా పంపిణీ యాప్ ద్వారా జరుగుతోంది. రైతులు తమ భూమి వివరాల ఆధారంగా నమోదు చేసుకుని ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా పొందుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా, రైతుల నుంచి రూ.300 వరకు నగదు వసూలు చేస్తున్నప్పటికీ, బిల్లులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రూ.266 ధరకే యూరియా విక్రయించినట్లు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు వాస్తవంగా చెల్లిస్తున్న మొత్తం, బిల్లులో నమోదవుతున్న ధర మధ్య వ్యత్యాసం ఉంటోందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
ఇదే పరిస్థితి కేవలం యూరియా విక్రయాలకే పరిమితమా? లేక ఇతర ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మ పోషకాల విక్రయాల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి వసూళ్లు జరుగుతున్నాయా? అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫెర్టిలైజర్ దుకాణాల్లో ధరలు, బిల్లులు, స్టాక్ రికార్డులు, విక్రయాల నమోదుపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎరువుల దుకాణాలపై అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి కేవలం నామమాత్రంగానే జరుగుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు, బిల్లుల జారీ, నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్), గ్రోమోర్ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా అందుబాటులో ఉండగా, కొన్ని ప్రైవేట్ దుకాణాల్లో మాత్రమే అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే సంబంధిత దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి విక్రయానికి సరైన బిల్లు జారీ చేసేలా కఠినంగా నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button