
డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరో నలుగురు నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పురానాపూల్ ప్రాంతంలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు సమాచారం అందడంతో మంగళ్‌హాట్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో దాడులు నిర్వహించి ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన నలుగురు పరారైనట్లు వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.




